Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో అపశ్రుతి.. కర్రల సమరంలో ఒకరి మృతి

Devaragattu Bunny Festival Tragedy One Dead in Stick Fight
Advertisement
  • దేవరగట్టు కర్రల సమరంలో మరోసారి తీవ్ర హింస
  • బన్నీ ఉత్సవంలో జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా గాయాలు
  • సంప్రదాయం పేరిట ప్రాణాలు కోల్పోతున్నా ఆగని ఉత్సవం
  • హింసను నివారించడంలో విఫలమవుతున్న అధికారులు, పోలీసులు
  • ఏపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
Advertisement
కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే కర్రల సమరంలో మరోసారి రక్తం చిందింది. దసరా పండుగ మరుసటి రోజు రాత్రి నిర్వహించిన బన్నీ ఉత్సవంలో తీవ్ర హింస చెలరేగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరిట జరుగుతున్న ఈ ఉత్సవం మరోసారి విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెవెళితే.. హోళగుంద మండలం దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను కొండపై నుంచి కిందకు తీసుకొస్తుండగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. స్వామివారి విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, దివిటీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

ఈ భీకర సమరంలో తలలు పగిలి, తీవ్ర రక్తస్రావమైనా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ ఘర్షణలో ఆలూరుకు చెందిన పోతురాజు అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన వందలాది మందిని హుటాహుటిన ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రతి ఏటా విజయదశమి మరుసటి రోజు అర్ధరాత్రి దేవరగట్టులో ఈ బన్నీ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడమే ఈ సమరం వెనుక ఉన్న సంప్రదాయం. ఈ ఉత్సవం కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు.

ఈ ఉత్సవంలో హింసకు తావులేకుండా చూడాలని పోలీసులు, జిల్లా అధికారులు ఏటా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం ఉండటం లేదు. భక్తుల రూపంలో కర్రలను ఆలయ పరిసరాలకు తరలించి, అర్ధరాత్రి సమయానికి దాడులకు దిగుతున్నారు. సంప్రదాయం పేరిట ఏటా జరుగుతున్న ఈ రక్తపాతాన్ని నివారించడం అధికారులకు సవాలుగా మారింది. ప్రాణాలు పోతున్నా ఈ ఆచారాన్ని కొనసాగించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement
Devaragattu Bunny Festival
Kurnool Stick Fight
Karrala Samaram
Mala Malleswara Swamy
Andhra Pradesh Festivals
Bunny Utsavam Violence

More Telugu News